Tuesday, October 5, 2010

బాబు నోట తూలుతున్న మాట! * నాడు నిషేధాన్ని నీరుగార్చి... ఈనాడు వీరంగమా? - నందమూరి లక్ష్మీపార్వతి ప్రశ్న ...

మద్యం దుష్పలితాలపై నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్య వల్లించిన సుద్దుల గురించి పత్రికలలో చదివి విస్తుపోనివారు అరుదుగా ఉంటా రు. అది చదివిన తరువాత నా వంటి వారికి ఈ విషయం రాయకుండా ఉండడం కష్టం. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్న వాస్తవం మన కళ్ల ముందు కన్పిస్తోంది. మద్య నిషేధాన్ని నిలువునా నీరుగార్చిన వారే ఇప్పుడు మద్యం వరదలై పారుతోందని కన్నీరుమున్నీరుగా విలపించడం మనందరికీ వినిపిస్తున్నది. ప్రభుత్వ పగ్గాలు ఎవరు చేపట్టినా మొదటిగా ఆలోచించవలసింది ప్రజా సంక్షేమం గురించే. ఖజానా ఏ విధంగా నిండినా ఫర్వాలేదన్న ధోరణి సరికాదు. కానీ జరుగుతున్నది అదే.

మద్యం దుకాణాలకు యథేచ్ఛగా అనుమతులు, వాటి అమ్మకాలకు లక్ష్యాలు నిర్దేశించడం ఆ ధోరణి ఫలితమే. ప్రజల రక్తంతో ఈ వ్యాపారం, ఈ ల క్ష్యాలూ ముడిపడి ఉన్నాయన్న వాస్తవాన్ని విస్మరించి, ఏడాదికేడాదికీ ప్రభుత్వమే ఇలా మద్యం వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోతే ఫలితంఏమిటి? సమాజం మొత్తం ఆ మహమ్మారికి బానిసైపోదా? బొక్కసానికి ఆదాయం రావాలంటే మద్యం అమ్మకాలు పెంచడం ఒక్కటేనా మార్గం? గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నప్పటికీ ఆర్థికాభివృద్ధిని సాధించిన వాస్తవాన్ని మనం ఎందుకు గమనించడం లేదు?

దేశం మొత్తం మీద మద్యం ఆదాయంలో మన రాష్టమ్రే అత్యున్నత స్థానంలో ఉన్నది. 2010-2011 సంవత్సరంలో ఎక్సైజు ఆదాయం రూ. 16 వేల కోట్లు దాటుతుందని అంచనా. ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత ఇదే రికార్డు. కానీ మద్యం ద్వారా ప్రజలు నష్టపోయేది రూ. 30 వేల కోట్ల రూపాయలని ఒక అంచనా. మద్య నిషేధం మీద రాష్ట్రం మల్లగుల్లాలు పడడం ఇటీవలి పరిణామం కాదు. ఈ రాష్ట్ర చరిత్రలో ఇద్దరు ముఖ్యమం త్రులు మాత్రమే మద్యనిషేధాన్ని తీసుకురావటంతో పాటు చిత్తశుద్ధితో అమలు చేయడానికి ప్రయత్నిం చారు. ఇద్దరూ వెన్నుపోటుకు గురై పదవి దిగిపోయిన వారే. ఒకరు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుగారైతే, మరొకరు నందమూరి తారక రామారావుగారు.

1994 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మద్యానికి వ్యతిరేకంగా గొప్ప ఉద్యమం నడిచింది. ఈ ఉద్యమం చదువుకున్న వారి నుంచి కాక చదువు లేని రైతుకూలీ మహిళల నుంచి రావటం విశేషం. సొంత ప్రయోజనాలతో ‘ఈనాడు’ దినపత్రిక ఆనాడు నిర్వహించిన పాత్ర కీలకమైనది. బ్రాందీ లేని గాంధీ రాజ్యాన్ని స్థాపించాలనే నినాదంతో ఆ పత్రిక యజమాని రామోజీరావు ఒక ఎజెండా తీసుకుని ప్రచారం చేశారు. మద్యపానంవల్ల కలిగే అనర్ధాలను తెలియజేస్తూ ఆ పేపర్లో ఏకంగా ఒక కాలమ్ నడిచేది. మద్యపానంతో కుటుంబాల్లో రేగే కలహాలు, ఆత్మహత్యల పేరుతో ఎన్నో కన్నీటి కథలు రాశారు. కుటుంబ గొడవలు కూడా వాటిలో చేరిపోయి తాగుడువల్ల జరుగుతున్న అనర్థాలను 70 ఎంఎంలో చూపించారు. మంచిదే- సమాజంలో చైతన్యం తీసుకురావటంతోపాటు ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేయటంలో మీడియా చేయాల్సిన పనిని ఆ పత్రిక చేసింది.

ఆ రాతలవల్ల మందుబాబుల్లో ఎంత మార్పు వచ్చిందో తెలియదుకాని మహిళల్లో మాత్రం విపరీత మైన ఆవేశం వచ్చింది. 1991 నుండి 1994 వరకు నడిచిన మద్య వ్యతిరేక ఉద్యమం నేలను చుట్టి నింగిని తాకిందా అన్నంతగా ఎగసింది. ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి గారు అక్టోబర్ 2వ తేదీ గాంధీ విగ్రహానికి పూలమాల వేయకుండా మహిళలు అడ్డుకున్నారు. ఆ పోరాటం నిజంగా చారిత్రకమైనదే. మద్యానికి వ్యతిరేకంగా అన్ని మహిళా సంఘాలు ఐక్య వేదికగా పోరాడిన అపురూప దృశ్యమది. మహిళల మీద 40 వేల వరకు కేసులు నమోదయ్యాయంటే పోరాట తీవ్రత ఎంతటిదో అర్థమౌతున్నది. దానికి స్పందించిన ముఖ్యమంత్రి కోట్ల పాక్షిక మద్య నిషేధం విధించారు.

ఇక 1994 ఎలక్షన్లకు ముందు ప్రచారానికి వెళ్లిన ప్రతిచోటా ఎన్టీఆర్‌ను మహిళలు నిలదీశారు. ఆ సందర్భంలో అధికారం వచ్చిందే తడవుగా సంపూర్ణ మద్య నిషేధం బిల్లు మీద సంతకం పెడ్తానని హామీ ఇచ్చిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఐదు నిమిషాల్లోనే మద్యపాన నిషేధం బిల్లుకు సంబంధించిన ఫైలు మీద సంతకం పెట్టి, ఆడపడుచులకు కానుకగా ఇచ్చానన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం బిల్లు 1995, జనవరి 16 నుంచి అమల్లోకి వచ్చింది.

ఎన్టీర్ ప్రభుత్వాన్ని కూలదోసి అడ్డంగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా 1996, సెప్టెంబర్ 5వ తేదీన మొదటగా ఒక ఫైలుపై సంతకం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అది ఎపీఐఐసీ అధీనంలో ఉన్న 140 ఎకరాల భూమిని ‘ఎల్ అండ్ టీ’ కంపెనీకి అప్పనంగా ధారాదత్తం చేయడానికి సంబంధించిన ఫైలు అది. అలాగే 1996 పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే ఎన్టీఆర్ అమలు చేసిన సంపూర్ణ మద్యపాన నిషేధానికి మంగళం పాడటం. దాని నేపథ్యం, పుట్టుపూర్వోత్తరాల్లోకి వెళితే, ఎన్టీఆర్ ముచ్చటగా మూడోసారి 12.12.1994న ముఖ్యమంత్రి అయ్యాక మూడు నిర్ణయాలు తీసుకున్నారు.

మొదటి నిర్ణయం- అప్పటి వరకు రూ. 3.50 లు ఉన్న కిలో బియ్యాన్ని తిరిగి 2 రూ.లకే ఇవ్వడం. 1983లో ఈ పథకం అమలు చేసినప్పుడు అయిన వ్యయం రూ. 78 కోట్లు, అదే 1989లో రూ. 368 కోట్లకు పెరిగింది. అందుకే కాంగ్రెస్ సబ్సిడీ బియ్యం ధరను రూ. 3.50కి పెంచింది. తిరిగి ఎన్టీఆర్ 1994లో ఈ పథకాన్ని అమలు చేయటంవల్ల ప్రభుత్వం మీద రూ. 1,300 కోట్ల అదనపు భారం పడింది. రెండవ నిర్ణయం విద్యుత్ రాయితీ- హార్స్‌పవర్ రూ. 50లకు ఇవ్వడం. ఇందుకు ప్రభుత్వం మీద పడిన భారం రూ. 750 కోట్లు. ఇక ప్రధానమైన మూడో విధానం- సంపూర్ణ మద్యపాన నిషేధం- దీనివల్ల ప్రభుత్వం మీద రూ. 1,100 కోట్ల అదనపు భారంపడింది. మొత్తంగా రూ. 3,150 కోట్లు సబ్సిడీల కింద ప్రభుత్వం భరించింది. మద్యనిషేధాన్ని పకడ్బందీగా కొనసాగించటానికి రాష్ట్రం నాలుగు మూలలా సరిహద్దు ప్రాంతాలలో 93 చెక్‌పోస్టులు పెట్టి ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌ను అప్రమత్తం చేశారు.

ఎన్టీఆర్ లండన్ ప్రయాణ సన్నాహాలలో ఉండగా నిజామాబాద్ రైతులు కలిసి మొలాసిస్ నిల్వలు పేరుకుపోతున్నాయని మొరపెట్టు కున్నారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించకపోవడంతో వాళ్లు హైకోర్టుకు వెళ్లి పారిశ్రామికావసరాలకు సరఫరా చేయడానికి అనుమతి పొందారు. 1995, జూన్ 21 ఎన్టీఆర్ లండన్ వెళ్లే ముందు హైకోర్టు ఆదేశానుసారం ఈ మేరకు ఫైలు మీద సంతకాలు చేశారు. అప్పటి ఆబ్కారీ మినిస్టర్ దేవేందర్‌గౌడ్‌కూ, రెవెన్యూ, ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉన్న చంద్రబాబుకూ ఈ విషయం తెలుసు. అయినా, ఎన్టీఆర్‌ను లండన్ వెళ్లనిచ్చి, ఇంకా బహిర్గతం కాని ఫైలులో ఉన్న విషయాన్ని ఈ ఇద్దరు మంత్రులు వెల్లడించారు.

మొత్తం మీడియాను చుట్టూ పెట్టుకుని లండన్‌కు ఫోన్ చేశారు. దానికి ఎన్టీఆర్- కోర్టు ఆదేశానుసారం రైతుల కోసం చేశాను తప్ప, మద్యం తయారీ ప్రశ్నే లేదని సమాధానం చెప్పారు. అయినా ఆయన మాటలను బయటికి చెప్పకుండా ఎన్టీఆర్ పొరపాటు చేశారన్న పద్ధతిలో చంద్రబాబు మాట్లాడాడు. దాంతో పత్రికలన్నీ ఆనాడు ఎన్టీఆర్‌ను దుమ్మెత్తిపోశాయి. ఇక రాజగురువు పత్రిక ఇంకొకడుగు ముందుకేసి ‘ఎడిటోరియల్’లో ఎన్టీఆర్ ప్రజాద్రోహం చేశాడని రాసింది.

నిజంగా మామమీద లేదా ఆయన ప్రభుత్వం మీద గౌరవం ఉంటే, బహిర్గతం కాని ఫైలులోని విషయాన్ని పత్రికలకు లీక్ చెయ్యటమెందుకు? ఒక వేళ ఆయన నిర్ణయంలో పొరపాటు ఉంటే, ముఖ్యమంత్రి లండన్ నుంచి తిరిగి వచ్చాక సరిచేయించవచ్చుగా! ఆయన క్యాబినెట్‌లో రెండు పదవులనుభవిస్తూ లోపంకాని లోపాన్ని ప్రజల ముందు పెనుభూతంలా చిత్రించి చూపాలనుకోవడం రాజకీయంగా చంద్రబాబు నీచత్వానికి నిదర్శనం కాదా? ప్రభుత్వాన్ని 6 నెలల్లోనే అస్థిరతకు గురి చేయడానికి బాబు పన్నిన వ్యూహమేమిటో దీనితో స్పష్టమవుతూనే ఉంది. అతని రాజగురువు సహకారం ఏమిటో ఆనాటి ఎడిటోరియల్ చూస్తే తెలుస్తుంది.

పోనీ ఎన్టీఆర్ చేసిన అంత భయంకరమైన తప్పుకు వాళ్లంతా చాలా ఆవేదన పడ్డారనే అనుకుందాం. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చి తాను గద్దె నెక్కాక 6 నెలలు తిరక్కముందే ఇతడెందుకు మద్యపాన నిషేధాన్ని ఎత్తేశాడు? ఎన్టీఆర్‌ను చిన్న విషయానికే ప్రజాద్రోహి అంటూ ఎడిటోరియల్ రాసిన రామోజీ తరువాత తన శిష్యుడి చర్యలనెలా సమర్థిం చాడు? చంద్రబాబు చర్యలకు తన పత్రికలో ఎటువంటి రూపం ఇచ్చి, పచ్చి అవకాశవాద వార్తలు రాశాడో గుర్తుండే ఉంటుంది. అవి చదివిన తరువాత ఆ ఇద్దరూ సిద్ధాంతాలనెట్లా తలకిందులు చేస్తూ ఉంటారో, అందుకోసం ఎన్ని నాటకాలు ఆడతారో స్పష్టంగా అర్థమౌతుంది.

చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఒరగబెట్టింది ఏమీలేకపోగా, అన్నీ రద్దు చేసి రద్దుల ప్రభుత్వంగా ముద్రవేసుకుంది. లోటు బడ్జెట్‌ను పూడ్చుకోవడానికి ఎన్టీఆర్ అమలు చేసిన సబ్సిడీలన్నీ ఎత్తేశాడు. ఆర్‌టీసీ చార్జీలే 5 ఏళ్లల్లో మూడుసార్లు పెంచాడు. ఏ సబ్సిడీలు చూపించి పన్నులు పెంచాడో చివరికి ఆ సబ్సిడీలు కూడా ఎత్తేయటం జరిగింది. 2 రూపాయల నుంచి కిలో బియ్యం ధర మళ్లీ 3.50కి పెరిగింది. రూ. 50 హార్స్‌పవర్ కరెంట్ రూ. 250 అయ్యింది. ఇక మద్యపాన నిషేధాన్ని సడలించే ముందు ఈ గురు శిష్యులిద్దరూ ఆడిన నాటకాలు, ప్రజల్ని నమ్మించ టానికి రాసిన వార్తా కథనాలు. అబ్బో- పెద్ద డ్రామానే నడిచింది.

కథ, స్క్రీన్‌ప్లే, డెరైక్షన్ అంతా శిష్యుడి వంతయ్యింది. మద్యపాన నిషేధం కావాలని ఆవేశంగా రాసిన ఈనాడు కథనాలకు, సడలించమని రాస్తున్న ఈనాటి ప్రకటనలకు ఎక్కడా పోలిక లేదు. మద్యం కథనాలు రాసి స్ర్తీలను పోరుబాట పట్టించింది ఈ పత్రికేనా అని ఆశ్చర్యం కలుగుతుంది ఒకసారి వెనక్కుతిరిగి చూస్తే. ‘అవసరానికో వార్త, అయిన వారికో సూక్తి’ అనే రామోజీ విధానం ఇలా తేటతెల్లమైంది.

రాష్ట్రంలో అక్రమ మద్యం పెరిగిపోతున్నందువల్ల గుంటూరును కేంద్రంగా చేసుకుని మద్యం మాఫియా అక్రమ వ్యాపారాలు చేస్తున్నందువల్ల ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండి పడుతున్నందున ఈ పథకాన్ని ఎత్తివేయాల్సి వచ్చిం దని చంద్రబాబు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. మహిళలు ఈ పరిస్థితిని సరిగా అర్థం చేసుకోవాలని కూడా తనదైన రీతిలో చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తూ విన్నవించుకున్నారు.

చంద్రబాబు వెంటే వంతపాడుతూ ఆయన రాజగురువు సంతాప తీర్మానం, తోక పత్రికల అశ్రునివాళితో మద్యపాన నిషేధ బిల్లును నిలువునా గొయ్యితవ్వి పాతిపెట్టేశారు. ఉద్యమం నీరుగారింది. ఓదార్పులు మాత్రం మిగిలాయి. నిషేధం అమలులో ఉన్నప్పుడే వైస్రాయ్‌లో మద్యం ఏరులై పారింది. మద్యం కారణంగా తన ప్రభుత్వం కూలిపోకూడదు కదా? అందుకే నిషేధం ఒక్క కలం పోటుతో ఎత్తేశాడు. స్వీయ అవసరాలకు పత్రికల్ని ఎంత బాగా వాడుకోవచ్చో నిరూపించిన కాలంగా దానికి చరిత్రలో ఎప్పుడూ స్థానం ఉంటుంది.

బడాబాబుల ప్రయోజనాలను రక్షించేందుకు, వారికి ముందే ఇచ్చినమాట మేరకు చంద్రబాబు మద్యనిషేధాన్ని సడలించారన్నది దాచేస్తే దాగని సత్యం. ఫలితంగా ఆనాడు ఏడువేల మందు దుకాణాలు అమాంతం తెరుచుకున్నాయి. లక్ష బెల్టు షాపులు వీరవిహారం చేశాయి. రాష్ట్రానికి ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. బాబు పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు సారా వ్యాపారం చేసి కోట్లు గడించినట్లు ఆనాటి పత్రికలు రుజువులతో బయటపెట్టాయి. మద్యపాన నిషేధానికి ఈ విధంగా తూట్లు పొడిచిన బాబు ఈ రోజున మద్యం వద్దని హితోక్తులు పలకడం, నూరుహత్యలు చేసినవాడు అహింసావాదినని చెప్పుకున్నట్లుంది.

ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య గారు లెసైన్సులు ఇవ్వడంలో చంద్రబాబుతో పోటీపడుతున్నారు. ప్రజలను రక్షించాల్సిన పాలకులు, ఈ విధంగా వారిని అస్వస్థత పాలు చేస్తూ ఖజానా నింపుకుంటున్నారు. ఈ దురవస్థకు అంతం లేదా! అంటూ బాధిత మహిళలు ప్రశ్నిస్తున్నారు. సమాధానం చెప్పేదెవరు?
నందమూరి లక్ష్మీపార్వతి